రాష్ట్రం లాక్‌డౌన్ ప్రభావం పాలు, కూరగాయాలు ఇతర నిత్యావసరాలపై పడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీటిన్నింటినీ ఈ నెల 31 వరకు సరిపోయేలా ముందుస్తుగా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. ప్రజలంతా ఒకేసారి రైతు బజార్లు, సూపర్ మార్కెట్లకు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. ఆదివారం జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఒకరోజు ముందుగానే ఒకట్రెండు రోజులకు సరిపోయే సరకులు కొనుగోలు చేసుకున్నారు. కానీ, మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో నిత్యావసరాల కోసం దుకాణాలు, రైతు బజార్లకు క్యూ కడుతున్నారు.
ఇదే అదనుగా దళారులు కూరగాయలు, నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్ చేయకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. రైతుబజార్లలో రైతులు కూరగాయలు వినియోగదారులకే విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు. సరిహద్దుల మూసివేత నేపథ్యంలో పొరుగురాష్ర్టాల నుంచి కూరగాయల సరఫరాలో ఆటంకం కలిగే అవకాశమున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు. నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించకుండా వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో సివిల్‌సైప్లె, రవాణా, హైదరాబాద్ పోలీస్‌కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, ఉద్యానశాఖ కమిషనర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటుచేశారు.